అక్షరార్చన
కటికి చీకటి తెరలు వెనుక కానరాని బాసలెన్నో
కళ్ళెదుటే కానవచ్చిన బలాడ్యుల మాటలెన్నో
మాట అంచున కత్తికట్టి మృదుపలుకుల గొంతుకోసి
పేదవాడి స్వేదనాన్ని పేరాశగా భుక్తి చేసుకొని
అంతరిక్షం శోధనలలో అహర్నిశలు శ్రమిస్తున్న
శాస్త్రవేత్తల శ్రమ ఫలాలు విస్మరించి చరించి
స్వార్థభావన స్వలాభాపేక్షే సొంతమై
మంది నోటికి మట్టిపూసి పెద్దవారిగ చరించే
అజ్ఞాన ముఖముల సుజ్ఞానమివ్వగ విజ్ఞానమివ్వగ
నేనే సైతం కలంపట్టి నేనే సైతం కవితరాసి
నేను సైతం భావితరమునకు బాటవేద్దును
బానిసత్వం తొలగొట్టి స్వాతంత్య్రం చేతబట్టి
దాని కొరకు అహర్నిశలు అందరమొక్కటై పోరు సలిపి
మానప్రాణములు గడ్డిపోచగా దేశ సేవకర్పించి
అమృత కలశపు స్వరాజ్యమే మన చేతనుంచి
దివికేగిన ధీరపురుషుల ,ధీరవనితల
ఆకాంక్షలను ఆసాంతము అన్యచిత్తములేక నేను
కోట్లమంది నోట్ల ఆశల నాల్కలన్నీ కత్తిరించగ
కదనరంగమున కలము ఖడ్గము కరముబట్టి
సంస్కరింపగ సవ్వసాచినై
నేను సైతం పోరుసలుపుతా
దేశభవితకు నాటిపోరును మేటిగ ఎత్తిచూపుతా
మనిషి మనిషిగ మసులుకొనగ మానవత్వం ఉట్టిపడగ
బావిలోని కప్పల మారునున్న మనుష జాతికి
భావి జగతిని నేనెత్తి చూపుతా
దీనులింత పొట్టగడవక పూరిపాకలో పస్తులుండగ
స్టారు హోటల్ ఖరీదు భోజనం చెత్తకుప్పకు స్వాగతించగ
జ్ఞానమింత నేలపాలై అహంభావం భూషితమైన
జనసందోహపు హృది జాలినింత స్రవింపగ
నేను సైతం పూనుకొంటా అక్షరార్చన చేసుకొంటా
Also Read : నేను సైతం
