ఏడడుగుల హరివిల్లు
నీ తొలి చూపుల సుకుమార స్పర్శలో
నా మనసొక నీలాకాశం
నీ చిరునవ్వుల నందనవనంలో
నా హృదయమొక ఎర్ర గులాబీ
నీ వెచ్చని ఆలింగనంలో
ఈ దేహమొక తన్మయ శిఖరం
నీ చల్లని ఓదార్పు మైమరపులో
ఈ జీవితమొక ఊదారంగు చిత్రం
నీ అధరాలు నా నుదిటిపై చుంబనం
చెరిగిపోని నారింజ వర్ణ సంతకం
నీ కనురెప్పలపై నిశి రాత్రి వాలిన వేళ
నేనొక ఇండిగో రంగు స్వప్న శకలం
మువ్వలకే సవ్వడినేర్పిన నీ పాదాలకు
పసుపునద్ది ఆహ్వానం పలుకుతున్నా
ఏడురంగుల్నీ ఏడడుగులుగా మలిచి
నా జీవనకుటీరంలోకి రమ్మంటున్నా.
Also Read : సంతోషాల హరివిల్లు
