బుద్ది బలము
పూర్వం విక్రమపురిని పాలించిన చంద్రహాసునకు కొడుకులు లేరు.రోహిణి అను కూతురు మాత్రం ఉంది.ఆమె చాలా అందగత్తె.ఈ సంగతి విని , పొరుగున ఉన్నఅమరావతి దేశ రాజు ఆనందవర్మ , రోహిణిని తనకిచ్చి పెళ్ళి చెయ్యమని కబురు పంపాడు చంద్రహాసునకు.
ఆనందవర్మ అధిక వయస్సు కలవాడు, క్రూరుడు, చెడు వ్యసనములు కలవాడు.అయితే అతను చంద్రహాసుని కంటే బలవంతుడు.బలవంతుడితో విరోదము మంచిది కాదని ఎరిగి కూడా చంద్రహాసుడు , తన కూతురు కింకా యుక్త వయస్సు రాలేదని , ఆమె వివాహం స్వయంవరం ద్వారా జరుగుతుందని ఏవేవో సాకులు చెప్పి, ఆనందవర్మ కోరికను చాకచక్యముగా తప్పించుకోగలిగాడు.
ఈ విషయము ఆనందవర్మ కు తీరని కోపము, అవమానమునకు కారణమయినది.విక్రమపురి పై దండెత్తి ఆ రాజ్యాన్ని స్వాధీనము చేసుకోవాలన్న దుర్భుద్ది కూడా అతడికి లేకపోలేదు.రోహిణి ని పెళ్ళాడడం ద్వారా విక్రమపురం కూడా తనది అయ్యే రెండు అవకాశాలూ యుద్దం లేకుండా కలిసివస్తాయని అతను అనుకున్నాడు.
రోహిణి ని పెళ్ళాడటం ద్వారా విక్రమపురి తనది అయ్యే అవకాశం లేకుండా పోయింది కనుక , యుద్దం ద్వారా విక్రమపురిని ముందు తనది చేసుకుని , అటు తరువాత రోహిణిని పెళ్ళాడటానికి ఆనందవర్మ నిశ్చయించుకొనెను.
ఆనందవర్మ తన దేశం మీదికి యుద్ద ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసి చంద్రహాసుడు భయపడ్డాడు.అతను మంత్రులతో సంప్రదించగా వారు రకరకాల సలహాలు ఇచ్చారు.ఎంతమంది ఎన్ని సలహాలు చెప్పినా చంద్రహాసునకు ఆచరణీయంగా కనబడ
లేదు.యుద్దం తప్పేటట్టు లేదు.యుద్దం జరిగితే సర్వ నాశనం తప్పదు.
రాజు ఈ భయంతో బాదపడుతుండగా ఒకనాడు ఒక యువకుడు ఆయన వద్దకు వచ్చి , ” మహారాజా! మన మీదికి శత్రువులు వస్తున్నారని విన్నాను.యుద్దం జరగకుండా శత్రువులను తిప్పి పంపేటందుకు నేను ఒక ఆలోచన చేశాను.దయచేసి నాకు ఒక
విల్లు, ఒక వెయ్యి బాణాలూ ఇప్పించండి” అని అడిగాడు.
” ఎవరు నువ్వు? విలుకాడివా? నువ్వు ఒక్కడివే శత్రుసేనతో తలపడి యుద్దం చేస్తావా? ” అని రాజు అడిగాడు. “మహారాజా! నేను కట్టెలు కొట్టుకుని వాటిని అమ్కుని బతికే వాణ్ణి.
అరణ్యం లో చాలామంది విలుకాండ్రను చూశాను గానీ, నేనెప్పుడూ విల్లు ఎక్కు పెట్టిన వాణ్ణి కానూ. నా ఆశయం శత్రువులను వెనుకకు తిప్పి పంపుటయే!” అన్నాడా యువకుడు.వాడు తనతో వేళాకోళం ఆడుతున్నాడని అనుమానం కలిగినది.
” యుద్దం చెయ్యటానికి వచ్చిన సేనను తిప్పి పంపటం మాటలనుకున్నావా? నిన్నుక్రూరంగా శిక్షిస్తాను” అన్నాడాయన చాలా కోపంగా.
” నా ప్రయత్నం సఫలము కాకపోతే శత్రువులే నన్ను చంపివేస్తారు.
మీరు నన్ను శిక్షించే శ్రమ ఉండదు కూడా.తమరిని నేను కోరినది స్వల్పం.నాకు విల్లూ, బాణాలూ ఇప్పించండి చాలు.నా ప్రయత్నం నేను చేస్తాను ” అన్నాడా యువకుడు.
వాడి మాటలలో నీతి, నిజాయితీ , ఆత్మవిశ్వాసము ప్రస్ఫుటముగా గోచరించాయి మహారాజుకు.అందుచేత ఆయన వాడికి విల్లూ, వేయి బాణాలూ ఇప్పించాడు.ఆ రోజే శత్రువులు విక్రమపురి పై దండెత్తి వస్తున్నారని సమాచారము తెలిసింది.
కట్టెలు కొట్టే యువకుడు అరణ్యం లోకి వెళ్ళి చాలా ఎత్తుగా ఉన్న చెట్ల కొమ్మలకు బాణాలు కొట్టి అవి గుచ్చుకున్న చోట బాణం చుట్టూ సుద్దతో వలయాలు గీశాడు.అడవి చెట్ల నిండా వాడి బాణాలే.
అమరావతి సేనలు అరణ్యం అవతల మైదానంలో దిగాయి.అమరావతి సేనలు యదేచ్ఛగా అడవిలో ప్రవేశించి తిరగసాగారు.వారికి చెట్లమీద గురి తగిలిన బాణాలు కనిపించాయి.విలుకాడు ఎవరో వాళ్ళకు తెలియదు కానీ , వాడికి గల గురి మాత్రం అద్భుతంగా కనిపించింది.
చెట్లమీద బాణాలను చెట్టు చుట్టూనా చూస్తూ ఒక కోనేరు వద్దకు వచ్చారు వాళ్ళు.దాని గట్టున ఒక యువకుడు కూర్చుండి తిండి తింటున్నాడు.వాడి ప్రక్కన ఒక విల్లూ, కొన్ని బాణాలూ కనబడ్డాయి.ఆ బాణాలు చెట్లమీద కనిపించిన బాణాల లాంటివే. ” నువ్వేనా ఇక్కడి చెట్లమీద బాణాలు కొట్టినది?” అని శత్రుసైనికులు అడిగారు.
” అవును.నేనే కొట్టాను” అన్నాడా యువకుడు”‘ మంచి గురి గల వాడివిగా కనబడుచున్నావే?” అని యన్నారు వాళ్ళు.’ అభ్యాసం చేస్తున్నాను” అన్నాడా కట్టెలుకొట్టే యువకుడు.వాళ్ళు అతనిని తమ సేనానాయకుని దగ్గరకు రమ్మన్నారు. వాడు అందులకు అభ్యంతరం చెప్పలేదు.
ఆనందవర్మ తన సేనానులతో ఒక గుడారంలో మాడ్లాడుకుంటూ ఉండగా విక్రమపురి సైనికులు ఆ యువకుణ్ణి తీసుకు వచ్చి , వాడికి గల గురిని తాము కళ్ళారా చూసిన సంగతి చెప్పారు.” మా సైన్యాన్ని చూశావు గదా! మీ రాజు యుద్దానికి సిద్దం కావడం లేదా? అని సేనా నాయకుడు యువకుణ్ణి అడిగాడు.
” మా రాజుగారు యుద్దానికి ఎప్పటినుంచో సిద్దంగా ఉన్నారు” అన్నాడా యువకుడు.” అయితే మరి నువ్వు సైన్యంలో ఉండక అడవిలో ఏమి చేస్తున్నావు! అని ఆనందవర్మ అడిగాడు.
” నేనింకా విలువిద్య అభ్యసిస్తున్నాను.మహారాజా! నా వంటి వాణ్ణి సైన్యంలో చేర్చుకుంటారా? నన్ను మించిన విలుకాళ్ళు ఐదువేల మంది ఉన్నారు మా రాజు గారి సైన్యంలో .సైన్యంలో చేరే అర్హత కోసం అడవిలో అభ్యాసం చేస్తున్నాను.” అన్నాడు ఆ యువకుడు.
” మాతో యుద్దం చేసి మీ రాజు గెలవగలడంటావా?” అన్నాడు ఆనందవర్మ ఆశ్చర్యంగా. ” ఆ ప్రశ్న నన్నడిగి ప్రయోజనం లేదు.యుద్దం చేసి చూడండి.మీకే తెలుస్తుంది” అన్నాడు ఆ యువకుడు.ఆనందవర్మ ఆ యువకుణ్ణి పంపేసి సేనా నాయకుడితో చాలా సేపు చర్చించి , తమ సేనలను వెనక్కు నడిపించుకు పోవటమే మంచిదని నిర్ణయించాడు.
అమరావతి సేనలు వచ్చినట్టే వచ్చి వెనుకకు తిరిగి వెళ్ళిపోయాయయని తెలిసి చంద్రహాసుడు చాలా ఆశ్చర్యపోయాడు.ఆయన కట్టెలు కొట్టే యువకుని పిలిపించి” శత్రువులు యుద్రం చెయ్యకుండా వెళ్ళిపోయారు.నువ్వు ఏం చేశావేమిటీ? అని అడిగాడు.
యువకుడు తాను చేసినదంతా చెప్పాడు.రాజు వాడి యుక్తికి మెచ్చుకుని , వానిని తన ఆస్థానంలో ఉంచుకుని , రెండేళ్ళపాటూ వాడికి సకల విద్యలూ నేర్పించి వాడికే తన కుమార్తెను ఇచ్చి వైభవోపేతంగా పెళ్ళి చేశాడు.
ఇందులోని నీతి : ” కండ బలము కంటే బుద్ది బలము గొప్పది.”
Also Read : అక్షరానికి ఆవేదన