Most Inspiring Book : నా జీవన యాత్ర

టంగుటూరి ప్రకాశం పంతులు

మహోజ్వల  ‘మన ప్రకాశం’.
                  ——————————
భారత స్వాతంత్ర్య సంగ్రామ  యోధులలో అగ్రశ్రేణిలో ని వారు ప్రకాశంగారు. పట్టుదల, ధైర్యసాహసాలు గల వారు.ప్రజయే ప్రకాశం, ప్రకాశమే ప్రజ యన్నట్లుగా ప్రజలతో మమేకమైన సిసలైన ప్రజానాయకుడు.ఆయన ఆత్మకథ నుండి కొన్ని ఘట్టాలను ముచ్చటించుకుందాము.
ఒక వ్యవస్థ:  ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు ఒక్క వ్యక్తి కాదు; అర్ధ శతాబ్దానికి పైగా  ఆంధ్ర రాజకీయ ప్రజాహిత జీవన రంగంలో ఆయన ఒక మహా సంస్థ.ఆయన వ్యక్తిత్వం మహా గోపుర శిఖరోన్నతం.ఆయన జీవిత గాథ బహుముఖ ప్రకాశం గానూ బహురస సంపన్నముగా ఉంటుంది.
కడు పేద: ప్రకాశం పంతులుగారు బొడ్డున మాణిక్యం పెట్టుకుని పుట్టిన భాగ్యశాలి కారు ఆయన.అతి సామాన్య  స్థితి —-కాదు , నిరుపేద దశ– లో నుండి  ఎదిగి ఎదిగి  మహద్వైభవ శృంగాన్ని  అందుకున్న అతి సత్త్వుడాయన.
 ఆయన సమకాలీకులు; మన స్వాతంత్ర్య సమర చరిత్ర లో అతిక్లిష్ట దశలో ఆయన నాయకత్వం మనకు లభించింది.ఆయన సమకాలీకులు గాంధీగారు, మోతీలాల్‌, పటేల్‌, అనీబిసెంట్‌, సరేజినీనాయుడు,పురుషోత్తమదాస్‌టాండన్‌, భోగరాజు పట్టాభిసీతారామయ్య మొదలగు వారు.
 ఆనాటి జీవన విధానం; ప్రకాశం గారు 1872 సం।  ఆగస్టు 23 న జన్మించారు. ఆ కాలంలో వాళ్ళ జీవితాలు మంచి హుందాగానూ , గంభీరంగానూ, నిగ్రహం
తోను గడిచి పోయేవి.కుటుంబాల్లో అన్యోన్య ప్రేమాతిశయాలు ఎక్కువగా ఉండేవి.
ఆస్తిపాస్తులలో వ్యష్టిగా ఉన్నా, ప్రేమానుబంధాల్లో సమస్టిభావము, ఏకతా ప్రతి నిమిషమూ కనబడుతూ ఉండేవి.జీవితావసరాలు అనుభవించే లక్షణం ఒక పవిత్రతగా భావింపబడేది.ఈ నాడు మన కళ్ళ ఎదుట కనబడే స్వార్థం ఆ రోజుల్లో అంతగాకనబడేది కాదు.ఆ రోజుల సంగతి తలచుకుంటే,మనకు, అది అంతా ఒక స్వప్నంలా తోస్తుంది.
    మనషుల్లో ఉండే ప్రేమాతిశయాలు గంభీరంగా కనబడేవి.ఆ కాలంలో గౌరవ కుటుంబాల లెఖ్ఖల్లో ఉన్న ఇల్లలో కూడా మట్టిపాత్రలలోనే వంటకాలు జరిగేవి.ఆనాటి జీవితంలో విశేషం ఏమిటంటే , నాణెం ఎంత సకృత్తుగా కనిపించినా జీవితావసరాలు , మర్యాధలు ఎంతమాత్రమూ లోపించేవి కావు.బంధుమర్యాదలు, స్నేహమర్యాధలు కూడా లోటు లేకుండా జరుగుతూ ఉండేవి.అంతా సాలెవాళ్ళు నేసి ఇచ్చిన వస్త్రాలు ధరించేవారు.ఆ రోజుల సంగతి తలచుకుంటే” సత్య యుగం అంటే అదేనా? ” అనిపిస్తుంది.
ప్రకాశం గారు పరీక్ష ; ఆ రోజులలో మిడిల్‌స్కూలు పరీక్ష వెళ్ళడం బ్రహ్మాండమైన పనిగా ఉండేది.పరీక్ష ఫీజు కట్టడానుకి డబ్బులు లేవు.ఏ ఒక్కరూ సహాయం చేయ లేదు.సొంత అక్కా, బావలు కూడా సహాయం చేయలేకపోయిరి.అందరి పరిస్థితి అంతంత మాత్రమే.” పంతులు గారి అమ్మ గారు తను కట్టుగునే పట్టుబట్ట తాకట్టు పెట్టి ఆ మూడు రూపాయలూ తెచ్చి ఇచ్చింది.ఆ గండంతో ఆయన మిడిల్‌ క్లాసు
పరీక్ష  పూర్తి  అయింది.
నాటకాలు+చదువులు; ప్రకాశం గారు రాజమహేంద్రవరము వచ్చిన తరువాత నాటకాల గొడవ అధికం అయ్యింది. గయోపాఖ్యానము, పారిజాతపహరణము
నాటకాల్లో వేషాలు వేసేవారు.ఈ నాటకాలగొడవల వల్ల ” సంగీతము చేత బేర సారము లుడిగెన్‌” అన్నట్లు చదువు సాగింది.ఈ నాటకాల మూలాన రౌడీ జనాలతో భేటీలు,ఒక విధమైన నిర్లక్ష్యమైన జీవనానికి అలవాటు పడ్డారు.’ మామూలు సాంసారిక దృష్టిలో కొంచెం న్యూనమైన జీవితంలో పడిపోతున్నానా?” అనే స్థితికి వచ్చారు.
       ప్లీడరు   వృత్తి; 1894 సం।। లో రాజమహేంద్రవరంలో ప్రాక్టీసు ప్రారంభించారు. ప్లీడరు వృత్తి ప్రారంభమైనప్పటినుంచి ఆయన ఫైలు బాగానే వుండేది.ఆరు మాసాలలో పెద్దప్లీడర్లకి  ఏ మాత్రము తీసిపోని ఫైలు ఉండేది.అంత వరకూ ఆయనను వెంటాడిన లేమి క్రమంగా వెనకపట్టింది.ఏ వృత్తిలో నైనా పేరు రావాలంచే ముందు పట్టిన కేసులలో మంచి పేరు సంపాదించాలి.ఆయన ప్రాక్టీసు కి వచ్చిన కొద్ది రోజులలోనే మంచి పేరు సంపాదించారు.క్లయింట్‌ల విషయం లో పట్టుదలగా పనిచేస్తారనే పేరు వచ్చింది.
రాజకీయాలు; 1901 సం।। లో రాజమహేంద్రవరం మునిసిపల్‌ చైర్మన్‌  గా ఎన్నుకోబడ్డారు.రాజకీయంగా వచ్చిన తొలి పదవి.
దేశభక్తి ; ఉజ్వలదేశభక్తి,నిరుపమత్యాగం, అన్నింటికన్న ముఖ్యంగా ఆయన అక్షయ శక్తి, స్వభావ సౌష్టవం- ఆయన విజయహేతువులు.ఆయన విజ్ఞానము, జీవితాను భవము నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకము.
అతివాదము ; కాంగ్రెస్‌ మితవాదుల నాయకత్వానికి స్వాధీనం అయినప్పటి నుంచి అది చాలా సాధారణమైన లాంఛనవ్యవహారమైపోయింది.-1908 సం।।ము లో జాతీయవదం మీదనే దాడి ప్రారంభించింది.1924 వరకూ ఇదే తంతు.
ప్రకాశంలాంటి అతివాదులు సయితం ఏమీ మాట్లాడలేకపోయారు.1915 సం।।ము నుంచి అతివాదము కొత్తగా విజృంభించింది.ప్రకాశంగారూ, అనీబిసెంట్‌ మొదలగు వారుతమ సహజంగా ఉండిన వాగ్ధోరణి, నిర్మాణపు నైపుణ్యము, రాళ్ళని సహితం చలింపజేసి ఉత్తేజం కలగజేసే శక్తి  రాజకీయ రంగంలో ప్రవేశించాయి. మొత్తం మీద దేశంలో ప్రస్ఫుటంగా పెరుగుతూ ఉన్న తీవ్రరాజకీయాందోళన ప్రభుత్వానికి కొంత కంగారు పుట్టించింది.
స్వరాజ్య పత్రిక ; ” స్వరాజ్యపత్రిక”  1921 వ సంవత్సరము  అక్టోబర్‌ 29 వ తారీఖు ప్రారంభించబడినది.మొదటి సంచిక ఆ రోజుననే బయలుదేరింది.
దేశీయపాఠశాలలు – చరఖా కేంద్రాలు ; ఆంధ్రదేశంలోని అన్ని మూలలా ప్రకాశంగారు
స్వంత భాద్యత మీద , పర్యవేక్షణ క్రిందా దేశీయపాఠశాలలు నెలకొల్పారు.దేశీయ విద్యాలయాలకు కాంగ్రెస్‌ నుంచి నయాపైసా కూడా తీసుకొనకుండా విరివిగా ప్రకాశం గారే ఖర్చు పెట్టారు.అఖిలభారత చరఖాసంఘం వారు కూడా భారతదేశంలో కెల్లా వీరు స్థాపించిన దేశీయపాఠశాల ఆదర్శప్రాయమైందిగా వర్ణించారు.
ప్రిన్స్‌ఆఫ్‌వేల్స్‌ ‘ బాయ్‌కాట్‌’; ప్రిన్స్‌ఆఫ్‌వేల్స్‌ పర్యటన విషయం లో ఏర్పాటయిన బహిష్కరణ ఉద్యమం చాలా ఘనంగా జరిగింది.ఆఖరికి రైల్వేపోర్టర్లు కూడా వైస్రాయిగారి సామానులు గానీ, ప్రిన్స్‌ఆఫ్‌వేల్స్‌ సామానులు గానీ ముట్టనయినా ముట్టలేదు.వారు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రకారము గానే చుక్కెదురయ్యింది.
ఇంతకంటే ఘనమయిన నిరసన ప్రపంచం మొత్తం మీద ఏ జాతీ చూపించి ఉండదు. జీవితాలు ప్రజాసేవకే; దేశాన్ని ఉద్దరించడానికి కంకణం కట్టుకున్న ఆ నాటి నాయకులు, ఏరు దాటి ముందుకు అడుగు వేసిన  అడుగు వెనక్కి తీసుకుని తిరోముఖం పట్టడానికి వీలులేని విధంగా , తమ్ము దాటించిన తెప్పలనన్నింటినీ తగులబెట్టరన్న మాట.కళాశాలలను విసర్జించి కాంగ్రెసులో జేరి జైలుకు వెళ్ళిన విధ్యార్థులు , ఉద్య
మాన్ని  విడిచిపెట్టి  తిరిగి కాలేజీలలో జేరడానికి గానీ, గవర్నమెంట్‌ నౌకరీలను ఆశించడానికి  గాని అణు మాత్రపు సావకాశం కూడా వుండేది కాదు.వారి జీవితలు ప్రజాసేవకి అంకితం అయిపోయాయన్నమాట।
‘సైమన్‌- తిరిగి పో’- ” గుండు కు గుండె”.  సైమన్‌ కమీషన్‌ రాక సందర్భంగా చెన్నై పౌరులు బ్రహ్మాండమయిన హర్తాలు జరిపారు.ఊరేగింపు సుమారు పదిమైళ్ళ పొడుగూ, పది మైళ్ళ వెడల్పూ గల పట్నం వీదులన్నీ  జనప్రవాహంతోనూ , కోలాహలంతోనూ నిండిపోయాయి.చెన్నపట్టణానినకి దూరతీరాలు వ్యాపించిన పట్టణం అని పేరు.
ఊరేగింపు  పారీస్‌ కార్నర్‌ దగ్గర కొచ్చే సరికి ఒక స్థూలకాయుడు చచ్చిపడి పోయాడు.గుంపులు చెదరగొట్టడానికి కొన్ని చోట్ల కాల్పులు జరిపారు.అప్పుడు గుంపులన్నీ చెదిరిపోయాయి.దారులన్నీ పోలీసులతోనూ, సైనికులతోనూ మూసేశారు.
ప్రకాశం గారు ఒక సిపాయి దగ్గరకు వెళ్ళి ఆ వ్యక్తిని చూడడానికి దారి యిమ్మని అడి గారు.దారి ఇవ్వడానికి వీలు లేదన్నాడు. ఒక సిపాయి ప్రకాశంగారి గుండెకు బారు చేసి తుపాకీ పట్టుకున్నాడు.నాకు దారి ఇవ్వమని ఆయన కోరారు.” మీరు బలవంతంగా వెళ్ళదలస్తే మేము కాల్చవలసి వస్తుందన్నాడు” ప్రక్కన ఉన్న వాలంటీరు ఆయన ఎవరో తెలుసా అని గద్దించాడు.
ఈ సంగతంతా దూరం నుంచి పండాలే అని అధికారి గమనిస్తున్నాడు.సిపాయి తుపాకీ గురిపెట్టేసరికి పరుగెత్తుకుని వచ్చి ” మీరు ప్రశాంతంగా చూసి వెళ్ళవచ్చు. దయచేసి అందరినీ ప్రశాంతంగా ఊరేగింపు కొనసాగించమనండి అంటూ బతిమి లాడుకున్నాడు.ఆ పండాలే అనే అధికారి  ప్రకాశం గారి దగ్గర జూనియర్‌ గా పని చేశాడు.ఆయన ఎక్కడ ఉన్నా ఒక మహోజ్వలము.రగిలే అగ్నిజ్వాల.ప్రకాశం గారు ఎక్కడ ఉన్నా మహాసముద్రము లాగా ప్రజావాహిని ఉండేది.
సంఘసంస్కర్త ; ప్రకాశం గారు రాజకీయాలలో ప్రవేశించకముందునుంచి గొప్ప సంఘ సంస్కరణ వాది.మన సంఘం లోని దురాచారాలను, వర్గ, వర్ణ విభేదాల ను రూపు మాపడంలో ఎంతో శ్రద్ద చూపారు.ఆయన పాత పద్దతులను అంటిపెట్టు కొనని విప్లవవాది.ప్రాచీన దురాచార విరోధి.స్వాభావికముగా ఆయనది విప్లవ ప్రకృతి.
ఉత్తరువులు; 1953 లో ఆంధ్రరాష్ట్ర అవతరణ శుభసమయమున కారాగారముల లో నున్న బంధీ లందరికీ విమోచనము కలిగించుచు ఆయన చేసిన ఉత్తరువు చరిత్రాత్మకమైనది.
సదాశివుడు ; ఆయన పట్ల ప్రజల అభిమానమున కెన్నడూ కొదవలేదు.రాజకీయ రంగమున హాలాహలమును మ్రింగి నిర్వికారముగా నిలిచిన సదాశివుడాయన.బహుముఖ వైభవోజ్జ్వలమైన జీవిత మది.హిమాలయమువలె అత్యున్నత మైన , అతిగంభీరమైన , అక్షయ క్షమాపూర్ణమైన మహౌదార్య మూర్తి ఆయన.
ఫిర్కా డెవలప్‌మెంట్‌ ; ఆయన దూరదృష్టి గల నేత ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన ఫిర్కాడెవలప్‌మెంట్‌ పేరు మారి నేటి మన పంచాయితీ రాజ్య ప్రణాళికకు మార్గదర్శి. పేదప్రజల పక్షపాతి; జమీందారీల రద్దు ప్రణాళిక ప్రకాశకర్తృకము.పేదల సంక్షేమమే సదా ప్రకాశము గారి ప్రదానాశయముగా నుండెను.
తెలుగు జాతి ఆశయదర్పములకు, రూపు కట్టిన ఉజ్జ్వలమూర్తి, తెలుగు జాతీయతకు ప్రతీక.నవీనాంధ్ర పిత.

 

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!