యండమూరి వీరేంద్రనాథ్
ప్రతి మనిషికి జీవితంలో కష్టనష్టాలు సహజం.అలాంటి సమయంలోనే మనవారి అవసరం మనకు అవసరమవుతుంది. అలాంటి సమయంలో చేయందించే చేయూత కరువైనప్పుడు, మంచి స్నేహితుడిలా ఒక పుస్తకం మనకు వెన్నుతట్టి మార్గ నిర్దేశం చేసినప్పుడు ఆ పుస్తకానికి మనం గుండెల్లో గుడి కడతామా?లేదా?అలాంటి పుస్తకమే.. విజయానికి ఐదు మెట్లు!.నా జీవితంలో అడుగడుగునా నాకు తోడై నిలిచిన ఆ పుస్తకం గురించి నా మాటల్లో..,
వీరేంద్రనాథ్ గారి నాన్ ఫిక్షన్ రచన “విజయానికి ఐదు మెట్లు” 1995లో పబ్లిష్ అయింది. ఇప్పటివరకు 12కు పైగా ముద్రణలకు నోచుకున్న ఏకైక రచన అంటే అతిశయోక్తి కాదు.లక్షకు పైగా కాపీలు అమ్ముడైన ఏకైక పుస్తకమిది.నాలాగే ఎందరో ఈ పుస్తకాన్ని చదివి,స్ఫూర్తి పొంది జీవితాన్ని సరిదిద్దుకున్నామని చెప్పిన సందర్భాలు కోకొల్లలు.
ఎలక్ట్రానిక్ రంగపు ఉధృతానికి దాదాపు పాపులర్ నవలా రచయితలందరూ అస్త్ర సన్యాసం చేసిన ఈరోజుల్లో ఈ పుస్తకం విజయం అనూహ్యం అంటూ యండమూరి వారే చెప్పుకొచ్చారు. .. అంటే ఈ పుస్తకం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో మనం ఊహించవచ్చు.
ఇక రచన విషయానికొస్తే మొదటి మెట్టులో జీవితం ఒక యుద్ధం, మన బలహీనతలు, టెన్షన్ మరియు అశాంతి అనీ చెబుతూ…అందులోని 4 అధ్యాయాలలో గెలుపుకు పునాది ఓటమి అని మన చేతే అనిపించారు.
తన రచనలో భాగంగా కొన్ని అద్భుతమైన నిర్వచనాలను కూడా వారు మనకు అందించారు. మచ్చుకు ఒకటి …ఒక మంచిస్నేహితుని గురించి చెప్పిన నిర్వచనం
“ప్రపంచం అంతా నిన్ను వదిలి పెట్టినప్పుడు నీతో ఉండేవాడు”
ప్రతి మనిషికి శత్రువులు ఉంటారని మనకు ఒక క్లారిటీ ఇస్తూనే, సమస్య వయసు చాలా చిన్నదని మనకు ధైర్యాన్ని నూరిపోశారు. అపజయం నుండి క్రుంగిపోకుండా దాన్ని ఒక అనుభవంలా భావిస్తే దానివల్ల కలిగే నష్టం తీవ్రత తక్కువగా ఉంటుంది అంటూ మనకు భరోసా ఇస్తారు.
“తప్పు చేయడం సహజం
దానివల్ల ఆత్మ న్యూనత పొందటం మూర్ఖత్వం”
ఎంత గొప్పగా చెప్పారు కదా!
ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన కోపం తగ్గించుకునే చిన్న చిట్కా…కోపానికి బద్ధ శత్రువు ఓర్పు! ఓర్పుకు ప్రతీక సాలెపురుగు. కోపం వచ్చినప్పుడు సాలెపురుగును గుర్తు తెచ్చుకోమంటాడు.
సాలె పురుగు ఎంతో ఓర్పుతో మరెంతో నేర్పుతో తన గృహ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది. కానీ మనం ఇంటి పరిశుభ్రత కోసం చీపురు కట్ట తో క్షణమైన ఆలోచించకుండా దాని సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తాం. సాలె పురుగు అనాధలా నేల పైన పడుతుంది. కానీ ఎవరిని కుట్టదు. మళ్లీ తన సహనం పోగుల్ని కలిపి నమ్మకం గోడల మీద పునర్నిర్మాణం చేస్తుంది. ఎలా బ్రతకాలో మనిషికి పాఠం నేర్పుతుంది.
నీలగిరి కొండల మీద దాదాపు 10 వేల పైన ఫైన్ మొక్కలను ఒక్కడే నాటిన జోస్ థామస్ అనే వ్యక్తి గురించి ఇందులో వివరించడం జరిగింది. అతను నాటిన మొక్కలే ఇప్పుడు మనం ఊటీలో చూస్తున్న వృక్షాలు. చెట్లు నాటుతూ అతిగా ప్రయాస పడుతున్న అతన్ని చూసి అందరూ అతన్ని మ్యాడ్ థామస్ అనేవారట.ఇప్పుడు ఆ చెట్ల వల్లే ఊటీ ఒక గొప్ప పర్యాటక ప్రాంతమయ్యింది.అందుకే ఒకరి గుర్తింపు కోసం కాకుండా మన కోసం మనం బ్రతికే రోజు రావాలంటాడు.
ఒకవైపుమానవ సంబంధాలు మంచివని అంటూనే… మరోవైపు స్వార్థం కూడా ఒక కళ! అంటూ మనల్ని కన్విన్స్ చేశారు. పాజిటివ్ థింకింగ్, నాయకత్వ లక్షణాలు, మన తప్పులను ఒప్పుకోవడం మరియు ఎదుటి వారి గొప్పతనం గుర్తించటం మనలోని మనకే తెలియని మన ఆయుధాలు అంటారు.
టైం మేనేజ్మెంట్ గురించి చెపుతూనే రొమాన్స్ తో రిలాక్సేషన్ దొరుకుతుంది అంటూ లైఫ్ లో రిస్క్ ఉంటేనే పరిణితి సాధ్యం అంటూ కంక్లూజన్ ఇస్తారు.
డబ్బు ఎలా సంపాదించాలి, మనీ మేనేజ్మెంట్ ద్వారా జీవితమనే వైకుంఠపాళిలో సంపూర్ణ విజయాన్ని పొందాలని మనల్ని ఉత్తేజపరుస్తూ, తన రచన అనే ఊతాన్ని మనకు అందిస్తూ తన విజయమనే ఐదు మెట్లు మనకు పరిచయం చేశారు.
మనోవిజ్ఞానానికి సంబంధించిన రచనలు తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్నవి కూడా ఏ స్కూలు లేదా కాలేజీ విద్యార్థులకు ఉద్దేశించిన పాఠ్యగ్రంథాలలా ఉన్నాయే తప్ప మామూలు పాఠకులందరూ చదివి అర్థం చేసుకోవటానికి వీలయ్యే సరళమైన భాషలో లేవు.
ఆ లోటును తీరుస్తూ, చక్కగా అందరికీ అర్థమయ్యే భాషలోనే కాక ఒకసారి చదవడం ప్రారంభిస్తే మరి వదలకుండా పాఠకుని చేత చివరంటా చదివించే ఆకర్షణీయమైన శైలితో విషయాన్ని వివరించిన తీరు బాగుందంటూ పలు పత్రికలు కూడా వేనోళ్ళ పొగిడాయి.
Also Read : తెలుగు జానపద గేయం- వివరణ