గుణపాఠం
కన్నబిడ్డల్ని చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు చేయి అందించి తల్లిదండ్రులుగా మా భాధ్యతను సక్రమంగా నిర్వర్తింఛాం. అదే బాధ్యత కన్నకొడుకు మాపై చూపడంలో నిర్లక్షం చూపడంతో మనసు విరిగిపోయింది. వాడి చదువుకోసం అహర్నిశలు శ్రమించాను. చదువు పూర్తయి ఉద్యోగం వచ్చాక ఇక మా ప్రమేయం లేకుండా ప్రేమ, పెళ్లి చేసుకున్నాడు.
మనసు, మానవత్వం అంటే ఏమిటో తెలియని అమ్మాయిని కొడలిగా తీసుకొచ్చాడు. ఆమె మానవతా సంబంధాలను ‘పాతచింతకాయ’ అని కొట్టిపారేస్తుంది. ఆర్ధ్రత, ఓదార్పు అనేవి ఆమెలో మచ్చుకైనా కనిపించవు.
తనను నమ్మినవాళ్లు ఏమవుతారో అని ఆలోచించదు. ఆమెకి కావాల్సిందల్లా అనుకున్నది జరగాలి అంతే. పెద్దలను గౌరవించడం, మన సంస్కృతీ సాంప్రదాయాలను పాటించడం ఆమెకు తెలియవు.
రెండేళ్ళకి మనవడు పుట్టాడు. ఇక ఇవన్నీ మరచిపోయి మానవడితో హాయిగా గడపడం నా దినచర్యలో ఒక భాగం అయింది. వాడి ముద్దు ముద్దు మాటలతో మా మధ్య ప్రేమానురాగాలు అల్లుకుపోయాయి. వచ్చిరాని మాటలతో నాకు ఎక్కడలేని శక్తిని ఇవ్వసాగాడు.
నేనంటే మా మనవడికి వల్లమాలిన ప్రేమ. అన్నీ బంధాలకన్నా తాత-మనవడుల బంధం ప్రత్యేకమైనది చెప్పవచ్చు. హాయిగా సాగిపోతున్న సమయంలో మా ఇంట్లో పెనుతుఫాన్ చెలరేగింది. మా చిన్న కొడుకు చదువు పూర్తయి ఉద్యోగ వేటలో ఉన్నాడు. రెండేళ్ల నుంచి కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా వాడి ప్రయత్నం ఫలించలేదు.
అది సాకు చూపుతూ “మేమిద్దరం సంపాదిస్తుంటే అందరూ ఇంట్లో కూర్చొని తింటుంటే ఇలా కుదురుతుంది. మీకందరికీ సేవలు చేసే ఓపిక నాకు లేదు.ఇంకా ఇక్కడ ఉంటే, నాకు అదనపు పని తప్ప మీ వల్ల నాకు ఉపయోగం ఉండదు. అందుకే మేము వేరు కాపురం పెట్టాలనుకుంటున్నాం” అని తన మనసులోని మాటను చెప్పింది కోడలు. ఆమె మాట్లాడుతుంటే ఐదు నిమిషాలు వినలేకపోయాను. నా సంసారం గురించి ఎవరికీ చెప్పుకోలేక నాలో నేను కుమిలిపోయాను.
ఆరోజు పక్కమీద వాలినా నిద్ర రావడం లేదు. భవిష్యత్తు గురించి ఆలోచనలు కందిరీగల్లా నన్ను చుట్టుముట్టాయి. పెద్దలకు ఇచ్చే మర్యాద ఇదా? ఆక్రోశించింది నా మనసు. గుండె చెరువయ్యింది. నా కళ్ళల్లో నీళ్లు తెరలు కట్టాయి. ఆరోజు నుండి అత్త-కోడలు మధ్య, నాకు కొడుకు, కోడలు మధ్య మాటలు కరువైనాయి.
మనవడ్ని నాతో కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంట్లో అన్నీ ఉన్నా ఇన్ని అనర్థాలకు మూల కారణం డబ్బు. దాని ముందు ఈ బంధాలు, బాంధవ్యాలు, అనుబంధాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ విరోధం వస్తుందనడానికి ఇదే ప్రత్యక్షసాక్షం.
డబ్బు విలువ ముందు మానవత్వానికున్న విలువ రోజురోజుకూ తగ్గిపోతోదనటానికి ఇదే నిదర్శనం. డబ్బే సర్వస్వం అనుకున్న మా కుమారుడు ఆ డబ్బు కోసం మమ్మల్ని వదులుకోవడానికే సిద్దపడ్డాడు.
కష్టపడి పండించిన పంట మన కడుపు నింపి ఆకలి తీరుస్తుంది. కన్నబిడ్డల్ని ప్రయోజకుల్ని చేస్తే కడుపు మంట రగిలిస్తున్నారు. ఇన్నాళ్ళు పిల్లల బాధ్యతలను మోస్తూ వారికి భరోసా కల్పిస్తే, ఇప్పుడు వాళ్ళు నన్ను బజారుకీడ్చి నా గౌరవమర్యాదలను మంటగలుపుతున్నారు.
ఈ రోజుల్లో మాలాంటి తల్లిదండ్రులు, నా కొడుకులాంటి ప్రబుద్ధులు చాలా మందే ఉన్నారు. ఏదో ఒక కారణం వలన తల్లిదండ్రులు వారికి భారమైపోతున్నారు.
బాల్యంలో తల్లిదండ్రులు తమ కోసం ఎంత కష్టపడ్డది, ఎన్నిన్ని త్యాగాలు చేసినది మర్చిపోయి ఈనాడు తమ ఆనందం కోసం స్వార్థంతో, తమని కని, పెంచిన వారిని దూరం చేసుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. అంతా డబ్బు మహత్యం.
నా కొడుక్కి భార్య మాటే వేదం. ఆమె చిప్పినట్టు వినకపోతే ‘చస్తానని’ బెదిరిస్తుంది. ఫలితంగా వేరు కాపురం పెట్టి, ఎంతో అన్యోన్యంగా వున్న మా తాత-మనవడులను వేరు చేశారు. వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడల్లా కళ్ళు చెమడ్చి, గుండెల నిండా బాధను అలుముకుంటుంది. అందుకే ఎవరితోనూ ఎక్కువ ఎటాచ్మెంట్ పెట్టుకోకూడదని నిర్ణయం తీసుకున్నాను.
పాలు పోసి పెంచిన పాము కాటేసినట్లు, కొడుకును పెంచి పెద్దచేసి ప్రయోజకుడ్ని చేస్తే వాడే పామై కాటేసి వెళ్లిపోయాడు. ఇది నా అనుభవంలో నేర్చుకున్న ఒక గుణపాఠం.
Also Read : కాలం అనుభూతుల నుంచి నేర్చిన పాఠం