Telugu Folk Song : తెలుగు జానపద గేయం- వివరణ

తెలుగు జానపద గేయం- వివరణ

తెలుగు జానపద గేయం (Telugu Folk Song ) – వివరణ

మా పల్లే అందాలూ,రేపల్లె చందాలు
కళ్ళకపటం లేని కన్న తల్లి చనుబాలూ
మంచికీ మారు పేరు మచ్చ లేని పల్లెటూరూ

అమ్మ నీకు వందనాలమ్మా,నా పల్లే తల్లీ,
వేల వేల వందనాలమ్మా,నను గన్నా తల్లీ
వేల వేల వందనాలమ్మా.

మా పల్లే అందాలూ, రేపల్లె చందాలు
కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలూ.

గల గల పారేటి వాగు వంకల తోటి
కిల కిల పలికేటి రామ చిలకలా తోటి

గల గల పారేటి వాగు వంకలతోటి
కిల కిల పలికేటి రామ చిలకలా తోటి

పచ్చని పైరులూ,పాడి పంటలతో
పచ్చని పైరులూ,పాడి పంటలతో

మురిసీ పోయేటి మురిపాల కొమ్మరా
వెలిగేటి వెన్నెలమ్మ రా నా పల్లే తల్లీ.
జానపద కూనలమ్మా రా
నన్ను గన్నా తల్లీ
జాన పద కూనలమ్మ రా

అమ్మ నీకు వందనాలమ్మా
నా పల్లే తల్లీ
వేల వేల వందనాలమ్మా
నన్ను గన్నా తల్లీ
వేల వేల వందనాలమ్మా.

చింత చిగురు ఆకులనే చీర కడతదీ
తుమ్మ పూల రేకులనే పైట వేస్తదీ

చింత చిగురు ఆకులనే చీర కడతదీ
తుమ్మ పూల రేకులనే పైట వేస్తదీ

ముద్దబంతి పూవులాగ ముద్దుగుంటదీ పల్లే
ముద్దబంతి పూవులాగ ముద్దుగుంటదీ పల్లే.

పొద్దు పొడుపునే బొట్టుగా దిద్దుకుంటదీ
మామిడాకు తోరణాలే రా,నా పల్లే తల్లికీ.
ముత్యాల హారాలు రా,నను గన్నా తల్లికీ.
ముత్యాల హారాలు రా, హాయ్

ఎక్కడుంది ఇంత అందమూ,నా పల్లేన తప్పా.
యాడ ఉంది ఇంత చందమూ,నా పల్లేన తప్పా.
యాడ ఉంది ఇంత చందమూ.

మా పల్లే అందాలూ,రేపల్లె చందాలు
కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలూ

పొలిమేర చేరగానే పొన్న పూలు పలకరించు
ఊరిలోకి వెళ్ళగానే గొరింతలే నవ్వి పిలుచు

పొలిమేర చేరగానే పొన్న పూలు పలకరించు
ఊరిలోకి వెళ్ళగానే గొరింతలే నవ్వి పిలుచు

అమ్మలూ అక్కలూ,చిన్నలు పెద్దలూ
అమ్మలూ అక్కలూ,చిన్నలు పెద్దలూ
కడుపారా నోట పిలిచి కమ్మగ మాట్లాడుతరూ.

కమ్మనీ కోయిల పాటరా,నా పల్లే తల్లీ
జుమ్మనీ తుమ్మెద ఆట రా ,నన్ను గన్నా తల్లీ
జుమ్మనీ తుమ్మెద ఆట రా.

ఎక్కడుంది ఇంత అందమూ,నా పల్లేన తప్పా
యాడ ఉంది ఇంత చందమూ,నా పల్లేన తప్పా
యాడ ఉంది ఇంత చందమూ.

కోడి కూతే నా పల్లెకు అలారమ్ము రా
పాడి ఆవు పాలే మరి పలారమ్ము రా
కోడి కూతే నా పల్లెకు అలారమ్ము రా
పాడి ఆవు పాలే మరి పలారమ్ము రా

కష్ట సుఖాలూ, మంచీ చెడులన్నీ
కష్ట సుఖాలూ,మంచీ చెడులన్నీ

సద్దీ మూటల్లే విప్పి చెప్పుకుంటారు
అమ్మ చేతి గోరు ముద్దరా,నా పల్లే తల్లీ
అమ్మమ్మ బోసి నవ్వు రా,నను గన్నా తల్లీ
అమ్మమ్మ బోసి నవ్వు రా.

అమ్మ నీకు వందనాలమ్మా,నా పల్లే తల్లీ
వేల వేల వందనాలమ్మా,నను గన్నా తల్లీ
వేల వేల వందనాలమ్మా.

మా పల్లే అందాలూ,రేపల్లె చందాలు
కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలూ.

తొలకరోస్తే పల్లే తల్లీ పులకరిస్తదీ
కూలీ నాలి రైతన్నల పలకరిస్తదీ

తొలకరోస్తే పల్లే తల్లీ పులకరిస్తదీ
కూలీ నాలి రైతన్నల పలకరిస్తదీ

ఏరువాక సాగమంటూ పోరు పెడతదీ పల్లే
ఏరువాక సాగమంటూ పోరు పెడతదీ

పని పాట చేసుకుంటు బతకమంటదీ
కష్టజీవి చెమట చుక్కరా,నా పల్లే తల్లీ.
పంటచేల రాసి కుప్పరా,నను గన్నా తల్లీ
పంటచేల రాసి కుప్పరా.

ఎక్కడుంది ఇంత అందమూ,నా పల్లేన తప్పా
యాడ ఉంది ఇంత చందమూ,నా పల్లేన తప్పా
యాడ ఉంది ఇంత చందమూ.

బతుకమ్మ పండుగొస్తే పువ్వులన్ని నవ్వుతాయి.
గడ్డిపూలు గంతులేస్తయ్, తంగేడు పూలు తెంపమంటయ్.
బతుకమ్మ పండుగొస్తే పువ్వులన్ని నవ్వుతాయి
గడ్డిపూలు గంతులేస్తయ్, తంగేడు పూలు తెంపమంటయ్

నునుపుగున్న గునుగు పూలు గుస గుసలే చెపుతాయి
నునుపుగున్న గునుగు పూలు గుస గుసలే చెపుతాయి

చెరువులోని తామరలు తెంపమంటు తొంగుతాయి బతుకమ్మ పండుగొస్తెరా
నా పల్లే తల్లీ.
పుత్తడిబొమ్మై పోవురా,నను గన్నా తల్లీ
పుత్తడిబొమ్మై పోవురా

ఎక్కడుంది ఇంత అందమూ,నా పల్లేన తప్పా
యాడ ఉంది ఇంత చందమూ,నా పల్లేన తప్పా.
యాడ ఉంది ఇంత చందమూ.

చుట్టమొస్తే కాకి తల్లి ఇంటి మీద వాలి చెప్పు
దొంగ వస్తె కుక్కలన్ని పోలీసల్లే కాపల గాచు

చుట్టమొస్తే కాకి తల్లి ఇంటి మీద వాలి చెప్పు
దొంగ వస్తె కుక్కలన్ని పోలీసల్లే కాపల గాచు

చీకటోస్తే నా పల్లెకు మిణుగురులే వెలుగునిచ్చు
చీకటోస్తే నా పల్లెకు మిణుగురులే వెలుగునిచ్చు

రోగమొస్తే నా పల్లెకు చెట్టు తల్లే పసరు పోసు
ఆరుద్ర పురుగు చందము రా,నా పల్లే తల్లికీ
ఆల మంద అరుపు అందం రా,నను గన్నా తల్లికీ
ఆల మంద అరుపు అందం రా

ఎక్కడుంది ఇంత అందమూ,నా పల్లేన తప్పా.
యాడ ఉంది ఇంత చందమూ,నా పల్లేన తప్పా.
యాడ ఉంది ఇంత చందమూ

అల్లనేరేడు పండ్లే పల్లే కంగురాలురా
తాటి పండ్లే నా పల్లెకు ఆపిల్ జ్యూస్ రా

అల్లనేరేడు పండ్లే పల్లే కంగురాలురా
తాటి పండ్లే నా పల్లెకు ఆపిల్ జ్యూస్ రా

మర్రి పండ్లు, తునిక పండ్లు, పరిక పండ్లు, ఈత పండ్లు
మర్రి పండ్లు, తునిక పండ్లు, పరిక పండ్లు, ఈత పండ్లు

తీరు తీరు పండ్లంతోటి నోరంతా ఊరిస్తూ
ఆరగించ రమ్మంటోంది రా,నా పల్లే తల్లీ
నోరారా పిలుస్తోంది రా,నను గన్నా తల్లీ
నోరారా పిలుస్తోంది రా

అమ్మ నీకు వందనాలమ్మా,నా పల్లే తల్లీ
వేల వేల వందనాలమ్మా,నను గన్నా తల్లీ
వేల వేల వందనాలమ్మా.

మొగిలి పువ్వే ,నా పల్లెకు సెంటు సీస రా
మొదుగు పూలే, నా పల్లెకు హోలి రంగు రా

రేగడి మట్టి, కుంకుడు గాయాలే షాంపోలు రా
రేగడి మట్టి, కుంకుడు గాయాలే షాంపోలు రా

నీటి గొలమే పల్లెకు చూపుడద్ధం రా
తీయని పాల భువ్వ రా, నా పల్లే తల్లీ
సిందోల్ల కాళ్ళి మువ్వ రా, నను గన్నా తల్లీ
సిందోల్ల కాళ్ళి మువ్వ రా

ఎక్కడుంది ఇంత అందమూ నా పల్లేన తప్పా
యాడ ఉంది ఇంత చందమూ నా పల్లేన తప్పా
యాడ ఉంది ఇంత చందమూ

న్యాయానికి నా పల్లే నాగమల్లె రా
న్యాయానికి ఎదురు తిరిగే ఎర్ర మల్లె రా

న్యాయానికి నా పల్లే నాగమల్లె రా
న్యాయానికి ఎదురు తిరిగే ఎర్ర మల్లె రా

సమతకు చెల్లి రా,మమతకు తల్లి రా
సమతకు చెల్లి రా,మమతకు తల్లి రా

వీరుల కన్నట్టి త్యాగాల వల్లి రా
ఉద్యమాల ఉడుంపట్టు రా,నా పల్లే తల్లీ
విప్లవాల ఆయువు పట్టు రా ,నన్ను గన్నా తల్లీ
విప్లవాల ఆయువు పట్టు రా

అమ్మ నీకు వందనాలమ్మా ,నా పల్లే తల్లీ
వేల వేల వందనాలమ్మా,నన్ను గన్నా తల్లీ
వేల వేల వందనాలమ్మా

మా పల్లే అందాలూ, రేపల్లె చందాలు
కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలూ
మంచికీ మారు పేరు మచ్చ లేని పల్లెటూరూ

అమ్మ నీకు వందనాలమ్మా
నా పల్లే తల్లీ
వేల వేల వందనాలమ్మా
నన్ను గన్నా తల్లీ
వేల వేల వందనాలమ్మా
నన్ను గన్నా తల్లీ
వేల వేల వందనాలమ్మా

మా పల్లే అందాలు పాట (Telugu Folk Song ) వివరణ :

మా పల్లె చాలా అందమైనది, కల్లాకపటం ఎరుగనిది, మంచితనానికి మారు పేరు, మచ్చ లేకుండా ఉండేది మా పల్లెటూరు అంద స్వచమైనది.మా పల్లె ప్రాంతాలలో పారే వాగులు వంకలూ ఉంటాయి. అందమైన రామచిలుక ఉంటాయి. పచ్చని పైరులతో విరాజిల్లుతుంది. నిత్యం పాడి పశువులతో నిండి ఉంటుంది. మా పల్లెటూరు వెలిగేటి వెన్నెలమ్మ లాంటిది, జానపదాలకు పుట్టినిల్లు లాంటిది.

చింత చిగురు, తుమ్మ పూలతో ముద్దబంతి పూవులాగా ముదుగుండి మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తుంది. మామిడాకు తోరణాలను ముత్యాల హారాలుగా ధరించి వసంత కాంతులను నింపుతుంది.మా పల్లెటూరిలోకి వెళ్ళే సమయంలో పొలిమేరలోనే పూలు స్వాగతిస్తాయి, ఊరిలోకి వెళ్ళగానే చిన్నా పెద్దా ప్రేమతో పిలిచి కల్మషం లేని మనస్సుతో సంతోషంగా మాట్లాడుతారు.

మా పల్లెల్లో కోయిలల కమ్మని పాటలు, ఆ పాటలకు అడుగులు వేస్తూ జుమ్మనే తుమ్మెదల ఆటలు మనస్సుకు సంతోషాన్ని కలిగిస్తాయి.ఉదయాన్నే కోడి కూతతో నిద్ర లేచి ఆవుల పాలను పలారంగా తీసుకుంటాము, కష్టాల గురించి అయినా సుఖాల గురించి అయినా సద్ధి మూటలని ఎలా అయితే విప్పి కలిసి తింటామో అదే విధంగా కష్ట సుఖాల గురించి చర్చించుకోవడం జరుగుతుంది. మా పల్లెల్లో అమ్మమ్మల బోసి నవ్వులు చూడ ముచ్చటగా వుంటాయి.

మా పల్లెల్లో తొలకరి చిరుజల్లులు కురిస్తే నేలతల్లి పులకరించి పోతుంది, కూలీలకు రైతులకు పనులు చేసుకోండి అంటూ ఏరువాక సాగమంటూ పోరు పెట్టీ కష్టపడి పనిచేసి ఇంత ధనంతో పాటుగా మంచిని సంపాదించి సంతోషంగా జీవించండి అంటూ అవకాశాలను అందిస్తూ సూచనలను ఇస్తుంది.

మా పల్లె ప్రాంతాలలో బతుకమ్మ పండుగలు వస్తే పువ్వులన్నీ నవ్వుతూ చాలా సంతోషంతో స్వామి వారి పాదాల చెంతకు చేరడానికి పరుగులు తీస్తాయి. గడ్డి పూలు, తంగేడు పూలు, గునుగు పూలతో బతుకమ్మని తయారు చేసి ఊరంతా ఊరేగిస్తుంటే పుత్తడి బొమ్మలాగా ఊరు మొత్తం మారిపోతుంది.

మా పల్లెటూరులలోకి చుట్టాలు వచ్చే సమయానికి ఇంటి మీద గానీ ఇంటి దగ్గర ఉండే చెట్ల మీద గానీ కాకులు వాలి ముందు సూచనగా అరుస్తాయి. దొంగలు, తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు వస్తె కుక్కలు కాపలాగా ఉంటాయి. దాని ద్వారా ఎవరో వచ్చారని గ్రహించి బయటకి వచ్చి చూస్తాము అప్పుడు వచ్చింది ఎవరో మాకు తెలుస్తుంది.

ఇంకా చెప్పాలంటే కుక్క చాలా విశ్వాసం చూపించే పెంపుడు జంతువు అని అందరికీ తెలుసు కాబట్టి ఎటువంటి కీడు, చెడు జరగకుండా ఉంటుంది.
మా పల్లెల్లో రోగాలోస్తే చెట్టు తల్లే వైద్యం అందిస్తుంది, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండవు అయినా చెట్టు పసరే బాగా పనిచేస్తుంది ఖర్చు కూడా తక్కువగా అవుతుంది.

మా పల్లెల్లో ఉదయం సాయకాలంలో ఆవుల మందల అరుపులు అందం, ఎందుకంటే తల్లి ఆవు లేగదూడలు కోసం ,లేగదూడలు తల్లి ఆవులు కోసం పిలుచుకుంటుంటాయి. ఎంతైనా “అమ్మ” అన్న పిలుపు అతి మధురం (Telugu Folk Song ) కదా సృష్టిలో. ఆరుద్ర పురుగు సుందరంగా ఉంటుంది కదా.

మా పల్లెల్లో అల్లనేరడు పండ్లును , తాటి పండ్లను ఆపిల్ జ్యూస్ లా బలం వస్తుంది అంటూ తాగుతుంటాము, తింటుంటాము. మరీ ముఖ్యంగా మర్రి, తనిక, ఈత ఇలా ఎన్నో నోరూరించే పండ్లు. ఈ పండ్ల అన్నింటినీ తినడానికి రండి అంటూ వెయ్యి చేతులతో సాధరంగా స్వాగతిస్తుంది పల్లెటూరు.

మా పల్లెటూరి మొగలి పువ్వు క్రింద పట్నం సెంటు సీసాలు వాసనలు పనికి రావు, అందుకనే మా పల్లెల్లో మొగలి పువ్వులనే సెంటుగా ఉపయోగిస్తాము. మోదుగు పూల రంగులను హోలీ రంగు రాలా ఉపయోగిస్తాము.

రేగడి మట్టి, కుంకుడు కాయలు సాంపోలుగా ఉపయోగిస్తాము. మా పల్లెల్లో స్నానం చేసిన తర్వాత చూసుకోవడానికి నీటి గోలాన్ని చూపుడు అద్దంగా ఉపయోగిస్తాము.

మా పల్లెటూరి పర్వదినాలలో సిందొల్ల ఆటలు పాటలు (Telugu Folk Song ) బహు ముచ్చటగా వుంటాయి, వారి ద్వారా కొన్ని కళలకు ఇప్పటికీ ప్రాణం ఉంది అంటే అతిశయోక్తి కాదు.

మా పల్లెల్లో న్యాయానికి కొదవ ఉండదు అన్యాయానికి తావుండదు. ఎందుకంటే న్యాయం కోసం ఎదురు నిలిచి ప్రాణాలైనా ఇస్తాం అవసరమైతే ప్రాణాలను అయినా తీస్తాం.సమతకు చెల్లి లాంటిది, మమతకు తల్లి లాంటివి మా పల్లెసీమలు. మట్టి మాణిక్యాలను ఇచ్చినట్లుగా వీరులను దేశానికీ అందిస్తుంది మా పెల్లేటూరులే.

విప్లవాలకు ఆయువును ఉద్యమాలకు ఊపిరిని అందిస్తూ నవసమాజ నిర్మాణం కోసం పరితపిస్తోంది. ఎక్కడ ఉంటాయి ఇంత అందచందాలు యాడ ఉంటారు ఇంత గొప్ప మనస్సున మనుషులు మా పల్లెల్లో తప్ప.

 

Also Read : సత్యం శివం సుందరం 

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!