Nenu Saitham : నేను సైతం
నేను సైతం
నేను సైతం
అస్త్రాన్ని శస్త్రాన్ని నేనే అక్షరాన్ని
నా చివరి వాక్యం వెంటనే ముగిస్తే
కాటికి సమయం ఆసన్నమైందని జ్ఞాపకం
మానవత్వం నింగిలో వేలాడుతూ
సూర్యచంద్రులు కన్నీరు కారుస్తారు.
నిర్విరామంగా అక్షర యజ్ఞం సాగుతోంది
కాలం ప్రవాహం నెత్తుటి రంగులు పులుముకొని
స్వప్నాల ఊహలన్నీ మూటగట్టుకుంటే
నిద్ర శ్వాసలో వేలాడుతున్నాయి.
చీకటి రాత్రి వెలుగు రేఖలు నేను
కర్తవ్యాన్ని కన్నీళ్లు పోసి కడిగి
నిర్దేశించే దిక్సూచిగా ప్రయాణం చేస్తూ
నలుదిక్కుల ప్రసరించాలని చూస్తా..
నిప్పు కణాల కవిత్వం రాపిడి నేను
విప్లవానికి సాన్నిహిత్యం
అక్షర బాణం ప్రయోగం ధనుస్సు ను
రుగ్మతలు సమాజానికి సంధిస్తున్నా.
అస్త్రాన్ని శస్త్రాన్ని అక్షరాన్నై
ఆకలి ఆరాటం పోరాటాన్నై
ఆరిపోతున్న అక్షర ప్రమిద లకు
ఇంధనమునై నేలపై జ్యోతినై వెలుగుతా..
అర్ధాకలితో అరణ్య రోదన విన్నాను
శ్రామికుడనై పనిలో గనిలో కేకలు వేస్తూ
చెమట విలువలకు రెక్కలు కదిలిస్తూ
శరీరముపై కర్మ జలానికి నేను ఊటనై
ఉప్పొంగే అభ్యుదయ ఆకలికి
నిత్య సంఘర్షణల గీతను
అజ్ఞానపు మట్టి పొరల్లో
అంతర్లీనంగా దాగి ఉన్న జ్ఞానపు పుంజం నేనే..
దోపిడీ రాజ్యములో శిధిలమైన భవంతిని
పరాయి బతుకులో నేలకొరిగిన వృక్షాన్ని
అనాదిగా తొక్కబడుతున్న బలి చక్రవర్తిని
కానీ బంతిలా ఎగిరేటందుకు ప్రయత్నిస్తా
చరిత్రలో ఒక పేజీ కోసం శ్రమిస్తే
వందల ఏండ్ల చరిత్రలో నిలిచిపోతా నేనే
రక్తముతో కత్తుల వంతెన నిర్మిస్తే
రుధిరం ధారపోసి కొత్త చరిత్ర సృష్టిస్తా
Also Read : మొదటి అడుగు